- .40 లక్షల చీరల క్లాత్‌ను ఉత్పత్తి చేసిన సిరిసిల్ల నేతన్నలు
- త్వరలోనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు
- నేతన్నల ఖాతాల్లోకి రూ.175 కోట్లు రిలీజ్
రాజన్న సిరిసిల్ల, వెలుగు : పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇవ్వాలనుకున్న ఇందిరమ్మ చీరలు రెడీ అయ్యాయి. గతేడాది నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మొదటి విడత కింద గ్రామీణ ప్రాంత మహిళలకు ఒక్కో చీరను ఇచ్చిన ప్రభుత్వం.. రెండో విడత కింద అర్బన్ మహిళలకు ఏప్రిల్‌లో చీరలు ఇస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా సిరిసిల్ల నేతన్నల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల ఉత్పత్తి పూర్తయింది. మొత్తం 40 లక్షల చీరలకు అవసరమైన క్లాత్ ఉత్పత్తి పూర్తి కాగా.. ఇందులో 35 లక్షల చీరల క్లాత్‌ను ఇప్పటికే టెస్కో సేకరించింది.
ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పంపిణీ
ఇందిరమ్మ చీరలకు సంబంధించిన క్లాత్ ఉత్పత్తి ఆర్డర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల నేతన్నలకు అప్పగించింది. మొత్తం 7 కోట్ల మీటర్ల క్లాత్ కోసం ఆర్డర్ ఇవ్వగా.. మొదటి విడత కింద 4 కోట్ల మీటర్ల క్లాత్‌ను ఉత్పత్తి చేయించింది. దాదాపు 60 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసింది. గతేడాది నవంబర్ 19న ప్రారంభమైన చీరల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ నాటికి పూర్తి అయింది. తాజాగా రెండో విడత కింద పట్టణ ప్రాంతాల మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావాల్సి ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు మేరకు టెస్కో ఆఫీసర్లు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు.
నేతన్నల ఖాతాలో రూ.175 కోట్లు
ఇందిరమ్మ చీరల క్లాత్‌ను ఉత్పత్తి చేసిన నేతన్నల ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.175 కోట్లు డిపాజిట్ చేసింది. ప్రభుత్వం అందించే యార్న్ తీసుకొని క్లాత్ ఉత్పత్తి చేసిన ఆసాములకు రూ.72 కోట్లు, యార్న్ తీసుకోకుండా సొంతంగా తెచ్చుకుని క్లాత్ ఉత్పత్తి చేసిన నేతన్నలకు రూ.100 కోట్లు రిలీజ్ చేసింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రభుత్వం అమౌంట్‌ను రిలీజ్ చేస్తోంది. ఇందిరమ్మ చీరల ఉత్పత్తిలో భాగమైన నేతన్నలకు ఎలాంటి ఎదురుచూపులు లేకుండానే నిధులు విడుదల అవుతుండడంపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు నిధులు రావడం ఆనందంగా ఉంది ఇందిరమ్మ చీరల ఉత్పత్తి దాదాపు పూర్తయింది. ఈ ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం నిధులను వెంటవెంటనే రిలీజ్ చేయడంతో కార్మికులకు ఎప్పటికప్పుడు పేమెంట్స్ చేస్తున్నాం. చీరల ఉత్పత్తి దాదాపు పూర్తి అయింది కాబట్టి మిగతా డబ్బులను కూడా రిలీజ్ చేయాలి. ఆడెపు భాస్కర్, సిరిసిల్ల పాలిస్టర్ ఆసోసియేషన్ ప్రెసిడెంట్

